Leading News Portal in Telugu

AP High Court: నేడు హైకోర్టులో కీలక పిటిషన్లపై విచారణ..


AP High Court: నేడు హైకోర్టులో కీలక పిటిషన్లపై విచారణ..

AP High Court: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో నేడు కీలక పిటిషన్లు విచారణకు రానున్నాయి.. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం ఈ రోజు వాదనలు విననుంది.. 41 జీవో తీసుకురావడంపై సీఐడీ దాఖలు చేసిన కేసును సవాల్‌ చేస్తూ చంద్రబాబు, నారాయణ వేసిన పిటిషన్‌ పై కూడా నేడు తీర్పు ఇవ్వనుంది హైకోర్టు.

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిట్‌ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.. అలాగే చంద్రబాబును అరెస్ట్‌ చేయవద్దు అంటూ సీఐడీ పీటీ వారెంట్‌పై హైకోర్టు ఇచ్చిన స్టే నేటితో ముగియనుంది.. దీంతో… దానిపై కూడా ఈ రోజు వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇక ఇదే కేసులో ముందస్తు బెయిల్‌ కోసం నారాయణ భార్య రమాదేవి, బావమరిది సాంబశివరావు, ఆ సంస్థ ఉద్యోగి ప్రమీల వేసిన పిటిషన్లపై కూడా విచారణ జరగనుంది. ఇటు కేబినెట్‌ ఆమోదం లేకుండా అసైన్డ్‌ భూముల కోసం జీవో 41ను తీసుకువచ్చారని.. చంద్రబాబు, నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులపై కూడా తీర్పు వెలువరించనుంది హైకోర్టు. అయితే, రెండు పిటిషన్లపై మళ్లీ విచారించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు తీర్పు ఇస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అసైన్డ్‌ భూముల కొనుగోలు వ్యవహారంలో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని నారాయణ పిటిషన్‌ వేశారు. దీనిపై కూడా ఈ రోజు విచారించనుంది హైకోర్టు. దీంతో పాటు అసైన్డ్‌ భూముల కొనుగోలు కేసులో సీఐడీ కేసులను క్వాష్ చేయాలని నారాయణ వేసిన పిటిషన్లను విచారించనుంది ఏపీ హైకోర్టు. కాగా, ఇప్పటికే ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే.