
Indrakeeladri Temple: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. టీటీడీ బోర్డు సభ్యులు మీకా శేషు బాబు , గాదిరాజు వెంకట సుబ్బరాజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వారికి ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో , పాలకమండలి ఛైర్మన్ , అర్చకులు ఘన స్వాగతం పలికారు.
అమ్మవారి ఆశీస్సులు భక్తులందరి పైనా ఉండాలని టీటీడీ బోర్డు సభ్యులు మేకా శేషు బాబు, గాదిరాజు వెంకట సుబ్బరాజులు అన్నారు. భక్తి భావం, సేవా భావం ఎక్కడ ఉంటాయో అక్కడే భగవంతుడు ఉంటాడని వారు పేర్కొన్నారు. భక్తి భావంతో ప్రతి ఒక్కరూ ఉండాలని వారు తెలిపారు. దసరాకు ఎక్కడ అసౌకర్యం లేకుండా వసతులు కల్పించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా అభినందనీయమని ప్రశంసించారు. అమ్మవారిని అందరికీ చేరువ చేసేలా చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు.
టీటీడీ నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని దుర్గ గుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో శ్రీవారి సోదరి అయిన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని ఆయన చెప్పారు. అలానే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో కూడా ఇంద్రకీలాద్రి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేలా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవాలని కోరారు.