Leading News Portal in Telugu

Nara Bhuvaneshwari: నన్ను మా బిడ్డల్లాంటి కార్యకర్తలు కలవకూడదా..?


Nara Bhuvaneshwari: నన్ను మా బిడ్డల్లాంటి కార్యకర్తలు కలవకూడదా..?

Nara Bhuvaneshwari: చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రిలో ఉన్న నన్ను మా బిడ్డల్లాంటి కార్యకర్తలు కలవకూడదా..? అంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. నాకు మనోధైర్యం కలిగించేలా టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముంది..? అని నిలదీశారు.. బాధలో ఉన్న అమ్మను కలుస్తామంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులివ్వడమేంటీ..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడిది..? అంటూ ప్రశ్నించారు నారా భువనేశ్వరి.. తన ట్వీట్‌కు పోలీసు నోటీసును కూడా జత చేశారు.. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు రాజమండ్రి నిర్వహించే ఏ కార్యక్రమానికి అనుమతులు లేవు అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు.

కాగా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. గత నెల 9వ తేదీన ఆయన్ని సీఐడీ అరెస్ట్‌ చేయగా.. 39 రోజులగా ఆయన రిమాండ్‌లో ఉన్నారు.. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. అయితే, ఆ కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడంపై భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు.. ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు “క్వాష్” పిటీషన్ పై విచారణ జరగనుంది.. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా.ఎమ్.త్రివేది లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు కొనసాగనున్నాయి.. 45వ ఐటెమ్ గా లిస్ట్ చేశారు. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ లూద్రా… ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోత్గి వాదనలు వినిపించనున్నారు.