
Sri Mahalakshmi Devi Alankaram: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.. నాలుగో రోజు శ్రీమహాలక్ష్మీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.. దీంతో.. తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రికి పోటెత్తారు భక్తులు.. క్యూలైన్లలో వెళ్లి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు.. ఇక, మహాలక్ష్మీ దే అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే.. ఆ అమ్మవారు సకల సౌభాగ్యాలు కలిగిస్తుందని ప్రతీతి.. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, పాలకమండలి అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇక, బెజవాడ కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం విశిష్టత గురించి ఆలయానికి చెందిన పూజారులు చెబుతున్న వివరాల ప్రకారం.. నవరాత్రులలో నాలుగో రోజు చాలా విశేషమైనది.. శ్రీమహాలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారు.. ఇరువైపులా గజరాజులు ఉండగా, చతుర్భుజాలతో, ఒక హస్తం అభయముద్రతో, రెండు హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది అమ్మవారు.. భక్తులను గజలక్ష్మీ రూపేణ పాలిస్తుంది.. శ్రీ మహాలక్ష్మీ అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వత్రేష్టం అని పండితులు చెబుతున్నారు. మరోవైపు.. ఈరోజు గులాబీరంగు వర్ణంలోని వస్త్రాలను ధరించి.. అష్టలక్ష్మీ సోత్రం, కనకధారాస్తోత్రం పారాయణ చేసుకుంటే ఎంతో శుభప్రదం. భక్తులకు దేనికీ కొదవ ఉండదని చెబుతున్నారు..