Leading News Portal in Telugu

AP High Court: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు స్వల్ప ఊరట..


AP High Court: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు స్వల్ప ఊరట..

అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ఊరట లభించింది. నవంబరు 7వ తారీఖు వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఆ పిటిషన్ పై విచారణను నవంబరు 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ్టితో ముగియడంతో హైకోర్టులో వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తీర్పు రింగు రోడ్డు కేసుకు కూడా వర్తిస్తుందని, అందుకే విచారణను నవంబరు 7కు వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు లాయర్లు కోరగా దానికి కోర్టు ఓకే చెప్పింది. ఇక, విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పీటీ వారెంట్ పై స్టేను కూడా నవంబర్ 7వ తేదీ వరకు పొడిగించింది.

అయితే, మరోవైపు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను టీడీపీ నేతల బృందం నేటి (బుధవారం) సాయంత్రం కలువనుంది. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్‌ను కలిసి చంద్రబాబు అక్రమ అరెస్ట్‌, నాయకుల గృహనిర్బంధం అంశాలను ఏపీ గవర్నర్ దృష్టికి టీడీపీ నేతలు తీసుకు వెళ్లనున్నారు. ఇక, చంద్రబాబు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా గవర్నర్‌కు వివరించే ప్రయత్నం టీడీపీ నేతలు చేసే అవకాశం కూడా ఉంది. గవర్నర్‌ను కలిసే టీడీపీ బృందంలో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, బోండా ఉమాలు ఉన్నారు.