
BJP Leader Bhanuprakash Reddy Fires on AP CM YS Jagan: ఏపీలో అప్పులు తప్ప అభివృద్ధి లేదని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఏపీ ప్రజలు కూరుకుపోయారన్నారు. టీటీడీ సొమ్మును తిరుపతి కార్పోరేషన్‌కు బదలాయించడం సమంజసం కాదన్నారు. ఏపీలో అరాచకం రాజ్యం ఏలుతుందని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తీరు సరికాదన్నారు. బాబు ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారని, అధికారులపై నమ్మకం సన్నగిల్లిందని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ… ’10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఏపీ ప్రజలు కూరుకుపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు
తప్ప అభివృద్ధి లేదు. టీటీడీ సొమ్మును తిరుపతి కార్పోరేషన్‌కు బదలాయించడం సమంజసం కాదు. రూ. 4,600 కోట్ల వార్షిక బడ్జెట్లో 1 శాతం నిధులను పరిశుభ్రత పేరుతో, మరో రూ. 50 కోట్ల నిధులను తిరుపతి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు. రూ.100 కోట్లను అభివృద్ధి పేరుతో తిరుపతి కార్పోరేషన్‌కు తరలించి కమీషన్ల పేరుతో జేబులు నింపుకుంటున్నారు. టీటీడీ ఛైర్మన్ తన రాజకీయ లబ్ది కోసం టీటీడీ నిధులను ఖర్చు పెడుతున్నారు’ అని అన్నారు.
‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడిని తిరుపతి నుంచి పోటీ చేయించే ఆలోచనలో భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. తిరుమల-తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం, ఇది ప్రభుత్వానికి ఆదాయ వనరు భావించరాదు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలిసే ఇదంతా జరుగుతుందా?. ఈ వ్యవహారంపై సీఎం జగన్ తక్షణ చర్యలు తీసుకోవాలి. ఏపీలో అరాచకం రాజ్యం ఏలుతుంది. దిష్టిబొమ్మలు తగులబెడితే బీజేపీ నేతలపై 307 సెక్షన్ కింద కేసులు పెడుతున్నారు’ అని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.