Leading News Portal in Telugu

Andhra Pradesh: దసరా కానుక.. అర్చకులకు సీఎం జగన్‌ శుభవార్త


Andhra Pradesh: దసరా కానుక.. అర్చకులకు సీఎం జగన్‌ శుభవార్త

Andhra Pradesh: వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వివిధ వర్గాలకు లబ్ధి చేకూర్చేలా బటన్‌ నొక్కుతూ.. వారి ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తూ వస్తున్నారు.. ఇక, విజయదశమి సందర్భంగా రాష్ట్రంలోని అర్చకులకు శుభవార్త వినిపించారు సీఎం జగన్‌.. అర్చకులకు ఇచ్చిన ఎన్నికల హామీని నెవరేర్చుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.. అర్చకుల కనీస వేతనం రూ.15,625లు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ కమిషనర్‌. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1,177 మంది అర్చకులకు లబ్ధి చేకూరనుంది.. మరోవైపు.. ఈ రోజు బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఏపీ సీఎం.. పట్టు వస్త్రాలతోపాటు పసుపు, కుంకుమలను ప్రభుత్వం తరపున అందించనున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతోన్న విషయం విదితమే.