
జనసేనలో వివిధ కమిటీల్లో కొత్తగా పలువురి నియామకం.. స్టేట్ కమిటీ, వివిధ కమిటీల్లో కొత్తగా పదవులిచ్చిన వారికి పవన్ కళ్యాణ్ నియామక పత్రాలను అందజేశారు. పీఏసీలోకి మాజీ మంత్రి పడాల అరుణ, విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షునిగా పంచకర్ల రమేష్ బాబు సహా పలువురిని పవన్ నియమించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేన దశాబ్ద కాలం పాటు ప్రయాణించింది.. ఈ కాలంలో జనసేన సిద్దాంతాలకు చాలా మంది అండగా నిలిచారు అని ఆయన తెలిపారు.
ఓ మనిషి నిజ స్వరూపం ఓటమిలోనే తెలుస్తుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఓటమిలో కూడా పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాల్లో జనసేనకు బలమైన కేడర్ ఉంది కానీ.. సరైన నేత లేరనే ఆవేదన తీరింది.. ధర్మరాజు, నాగరాజు వంటి మంచి నేతలు లభించారు.. రాష్ట్రానికి బలమైన దిశా నిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టే తెలుగుదేశంతో కలిశాం అని ఆయన అన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంతో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ పోవాలి.. జనసేన-టీడీపీ రావాలి ఇదే రకంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి.. సీఎం పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమనేది నా భావన.. సీఎం పదవి వస్తే స్వీకరిద్దాం.. కానీ, దాని కంటే ముందు రాష్ట్రం ముఖ్యం అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.