
CM YS Jagan: పోలీసు ఉద్యోగం ఒక సవాల్‌తో కూడుకున్నది అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణం వదిలిన పోలీస్ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు.. ఇక, ప్రస్తుత రోజుల్లో నేరం తన రూపాన్ని మార్చుకుంటోందన్న ఆయన.. కొత్త టెక్నాలజీ వల్ల సైబర్ సెక్యూరిటీ నుంచి డేటా చోరీ వరకు నేరాలు జరుగుతున్నాయన్నారు.. ఈ పరిస్థితుల్లో పోలీసులు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్ వాడకం ద్వారా సైబర్ ప్రపంచంలో చీకటి ప్రపంచం సృష్టించుకున్న వారిని ఎదుర్కోవాల్సిన బృహత్తర బాధ్యత పోలీసులపై ఉందన్నారు సీఎం వైఎస్ జగన్..
ఇక, సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీసు.. ఖాకీ డ్రెస్ అంటే త్యాగనీరతి అని పోలీస్ ఉద్యోగం ఓ సవాల్ అని పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్.. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులర్పించారు. అక్టోబర్ 21వ తేదీన పోలీస్ అమరుల సంస్మరణ దినం.. గడిచిన 64 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలను స్మరించుకునే రోజు ఈరోజు.. దేశప్రజలంతా మన పోలీసులను మనసులో సెల్యూట్ చేసే రోజుగా అభివర్ణించారు. మరోవైపు.. విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. శాంతి భద్రతలను పరిరక్షించాలి. సాంకేతికతకు తగ్గట్లు అప్డేట్ కావాలని సూచించారు సీఎం వైఎస్ జగన్.