Chelluboina Venugopal Krishna: పవన్ కల్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.. తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా ఎందుకు..?

Chelluboina Venugopal Krishna: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. రాజకీయ విలువలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించారు. రాజమండ్రిలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఎన్నికకు పవన్ కల్యాణ్ ఒక్కొక్క విధానం అవలంభిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు దేనికి సాంకేతమని ప్రశ్నించారు. ఇక, పవన్ ను రాజకీయాల్లో ఒక టూల్ గా వాడుకుంటున్నారని విమర్శించారు. కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీని అధికారంలోకి తీసుకుని రావాలని పవన్ కల్యాణ్ ప్రయత్నం చేస్తున్నారన్నారు విమర్శలు గుప్పించారు.
ఇక, ముద్రగాడను శోభకు గురి చేసింది చంద్రబాబే.. మరోసారి కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు వేణుగోపాలకృష్ణ.. చంద్రబాబు మోసానికి కాపులు నష్టపోతారని పవన్ కల్యాణ్ గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మరో 14 ఏళ్లు ప్రతిపక్ష నేతగా చేసిన చంద్రబాబు శకం ముగిసిందని దుయ్యబట్టారు. చంద్రబాబు చట్టాలకు అతీతుడు, దేశంలో చట్టాలు వర్తించవనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేవారు. 18 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు.. నేడు బెయిల్ రాక క్షోభకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు. చెప్పింది చెప్పినట్టు చేసే నాయకుడు వైఎస్ జగన్ అంటూ కొనియాడారు. ఒక మాట చెప్పాడంటే దైవంగా భావించి చేసే నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ, జనసేన ఇద్దరే కాదు ఎంతమంది కలిసి వచ్చినా.. జగన్ ను ఏం చేయలేరని స్పష్టం చేశారు. జనం మనసులో జగన్ ఉన్నాడు.. జగన్ మనసులో జనం ఉన్నారు.. జగన్ – జనం బంధాన్ని ఎవరూ విడదయలేరన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.