
Jagananna Arogya Suraksha: ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడం.. టెస్ట్‌లు చేయడం.. అక్కడే మందులు ఇవ్వడం.. ఇలా ప్రజల అనారోగ్య సమస్యలపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.. అయితే, జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ సరికొత్త రికార్డు సృష్టించింది.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 6 కోట్లకు పైగా ఉచిత వైద్య పరీక్షలతో సరికొత్త రికార్డు నెలకొల్పింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. సెప్టెంబర్ 30వ తేదీన ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ ద్వారా ఇప్పటివరకు వరకు 9,105 వైద్య శిబిరాలను నిర్వహించారు.. ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ శిబిరాలకు ఇప్పటి వరకు 41 లక్షల మంది హాజరయ్యారు.. వీరిలో ఉచితంగా వైద్యులను సంప్రదించనవారు 39.5 లక్షల మంది..
ఇక ఇంటి వద్దే నిర్వహించిన రాపిడ్ పరీక్షలు 6.14 కోట్లకు పైగా ఉన్నాయి.. ఇప్పటి వరకు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నవారు సంఖ్య 3.63 కోట్లకు పైగా ఉంది.. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శాఖ షెడ్యూల్ ప్రకారం ఈ వైద్య శిబిరాలను జోరుగా నిర్వహిస్తోంది. శిబిరాల్లో ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యుల సేవలను పొందుతున్నారు.. ఇక, వైద్యులు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ప్రతీ ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం విదితమే.