Leading News Portal in Telugu

Deputy CM Narayana Swamy: రోజుకు రూ.25 కోట్లు లాయర్లకే ఖర్చు.. చంద్రబాబుపై సింపతీ ఎక్కడా పెరగలేదు..


Deputy CM Narayana Swamy: రోజుకు రూ.25 కోట్లు లాయర్లకే ఖర్చు.. చంద్రబాబుపై సింపతీ ఎక్కడా పెరగలేదు..

Deputy CM Narayana Swamy: స్కిల్‌ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉండగా.. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా.. అన్ని కోర్టుల్లో ఆయన కేసులపై విచారణ సాగుతూ వస్తుంది.. అయితే, చంద్రబాబు లాయర్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపిస్తుంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఈ వ్యవహారంపై స్పందించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. రోజుకు 25 కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు లాయర్లకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.. తిరుపతి జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వద్ద కలెక్టర్ వెంకట రమణ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డితో కలిసి పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు లాయర్ల కోసం రోజుకు రూ.25 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారు.. చంద్రబాబుకు ఈ డబ్బు అంతా ఎక్కడ నుంచి వచ్చింది? అని ప్రశ్నించారు.

అవినీతి అంతంచేసే చట్టం 17ఏగా పేర్కొన్నారు నారాయణస్వామి.. ఇక, చంద్రబాబుపై సింపతీ ఎక్కడా పెరగలేదన్నారు.. సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారు.. నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. కానీ, సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిట్టిన వారినే నేను తిట్టాను, మా నాయకుడ్ని ఎవరైనా తిడితే ఊరుకోను అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఫోటో తీసేసి ఓట్లు అడగండి నాలుగు సీట్లు గెలిస్తాడా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. పుంగనూరులో పోలీసులుపై దాడి చేయించింది చంద్రబాబు అని ఆరోపించారు.. పుంగనూరులో టీడీపీ నేతలు టెర్రరిస్టులు మాదిరే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంపుడు రాజకీయాలు మొదలైంది చంద్రబాబు కుటుంబం నుంచే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక, మనకోసం దేశం కోసం అమరులైన వీరులకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అన్నారు నారాయణస్వామి.. పోలీసులు అంటే భగవంతుడ్ని చూసినట్లుగా భావిస్తా, కుటుంబాలను పక్కనపెట్టి విధి నిర్వహణలో ఉంటారన్న ఆయన.. పోలీసు జీతాలు మరింత పెంచాలని, ప్రధాని వద్ద పనిచేసే సిబ్బంది నుంచి కింది స్థాయి వరకు జీతాలు పెంచాలని ఆశిస్తున్నా అన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది 188 మంది పోలీసులు అమరులు అయ్యారు.. తిరుపతి జిల్లా నుంచి విధి నిర్వహణలో ఐదుగురు అమరులు అయ్యారని గుర్తు చేసిన ఆయన వారికి నివాళులర్పించారు. మరోవైపు.. అమరులైన పోలీసుల కుటుంబాలను సత్కరించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.