
Tirumala Brahmotsavam 2023 ends on Monday: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదోవ రోజు కొనసాగుతోంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి విశేష సమర్పణ చేసిన అనంతరం స్వర్ణ రథంలో ఊరేగించారు. గరుడ సేవ తర్వాత రథోత్సవానికే అంతటి ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఉదయం స్వర్ణ రథంపై అధిష్ఠించిన స్వామికి భక్తులు నీరాజనాలు పలికారు.
నేడు రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య వాహన సేవల్లో చివరగా అశ్వ వాహన సేవ జరగనుంది. అశ్వ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నేటితో శ్రీవారి వాహన సేవలు ముగుస్తాయి. సోమవారం ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య ఉత్సవాల ముగింపుగా చక్ర స్నానం క్రతువును శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించనున్నారు. దాంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.
తిరుమల తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. దసరా పండగ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా లేదు.