
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. పూర్ణాహుతి కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ, చైర్మన్ కర్నాటి రాంబాబు, ఎండోమెంట్ కమిషనర్, ఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల పాటు వైభోవోపేతంగా దసరా ఉత్సవాలు జరిగాయని అన్నారు. ఏపీ ప్రజలకు మంత్రి కొట్టు సత్యనారాయణ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
మధ్యాహ్నం నుంచి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. రేపు కూడా రాజరాజేశ్వరి దేవి అలంకారం కొనసాగుతుందన్నారు. భవానీ దీక్షా పరులు లక్షలాదిగా వస్తారని అంచనా వేస్తున్నాం.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామని తెలిపారు. సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహిస్తున్నాం.. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఇదిలా ఉంటే.. కృష్ణానదిలో తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. మరికాసేపట్లో శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులు కృష్ణానదిలో విహరించనున్నారు. తొలుత శివాలయం మెట్ల మార్గం నుంచి ఊరేగింపుగా ఉత్సవ మూర్తులు దుర్గాఘాట్ కు చేరుకోనున్నట్లు మంత్రి తెలిపారు. దుర్గాఘాట్ వద్ద శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు వైదిక కమిటీ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం కృష్ణానదిలో స్వామి వార్లు మూడు రౌండ్లు విహరించనున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పాస్ లు ఉన్న వారిని మాత్రమే అనుమతించనున్నారు అధికారులు. మరోవైపు పున్నమి ఘాట్, ప్రకాశం బ్యారేజి, దుర్గగుడి ఫ్లై ఓవర్ పైనుంచి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులు తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు అత్యధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.