
కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లోని కొండపై కొలవైన ఉన్న శ్రీ మాల మల్లేశ్వర స్వామి క్షేత్రానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. దసరా తరువాత స్వామివారి కల్యాణం జరుగుతుంది. ఆ సందర్భంగా ఉరేగింపు ఘట్టంలో కర్రల సమరం ఆనవాయితీగా వస్తుంది. గత కొన్ని ఏళ్లుగా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవానికి గొడవల వల్ల కర్రల సమరంగా ఆ పేరు వచ్చింది. ఇది సమరం కాదు.. సంప్రదాయం అని అక్కడి భక్తులు అంటున్నారు.
దసరా పండగ ముగిసన మరుసటి రోజు దేవరగట్టు యుద్ధానికి తెరలేచింది. మాల మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవానికి రంగం సిద్దమైంది. మరి ఈసారైనా పోలీసుల వ్యూహం కర్రల యుద్ధాన్ని కట్టడి చేస్తుందా? అనే అనమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు కర్రలకు రింగులు పడుతుంటే.. మరోవైపు పోలీసులు నిఘా పెంచారు. దేవరగట్టు బన్నీ ఉత్సవానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అర్ధరాత్రి నుంచి ఇక హైవోల్టేజీ ఉంటుంది.
ఇక, బన్నీ ఉత్సవానికి ముందు వచ్చే అమావాస్య నుంచి నెరిణికి తండా, నెరిణికి, కొత్తపేట గ్రామాలకు చెందిన భక్తులు దీక్షలు చేపడతారు. ఉత్సవాలు ముగిసే వరకు చాలా నిష్టతో దీక్ష చేస్తారు. మాల మల్లేశ్వరీ స్వామి కల్యాణోత్సవం తర్వాత ఉత్సవ మూర్తులను తరలించే క్రమంలో కర్రల సమరం జరుగుతుంది. ఈ మూడు గ్రామాల ప్రజలు.. ఇతర గ్రామాల నుంచే వచ్చే భక్తులు వర్గాలుగా విడిపోయి కర్రలతో సమరానికి తెరలేపుతారు. ఉత్సవ విగ్రహాలు సింహాసనం కట్ట దగ్గరకు చేరుకున్న తర్వాత బన్నీ ఉత్సవం క్లోజ్ అవుతుంది. అప్పటిదాక హైటెన్షన్ కొనసాగుతుంది.
అయితే, మాల మల్లేశ్వరస్వామి దసరా ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 2000 వేల మంది పోలీసులతో బందోబస్తు.. అలాగే, 100 మంది రెవెన్యూ, 100 మంది విద్యుత్ శాఖ సిబ్బంది, మరో 100 మందు వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది కూడా డ్యూటీ చేస్తారు. ఈ కర్రల సమరంలో గాయపడ్డ భక్తుల చికిత్స కోసం 100 పడకల తాత్కాలిక ఆసుపత్రి కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అంబులెన్సులను రెడీగా ఉంచారు.