Leading News Portal in Telugu

Devaragattu Bunny Festival: దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఒకరు మృతి, 100 మందికి పైగా గాయాలు..


Devaragattu Bunny Festival: దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఒకరు మృతి, 100 మందికి పైగా గాయాలు..

దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్రల సమరంలో దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. ఇక, ఒక యువకుడు మరణించాడు. మృతుడు ఆస్పరికి చెందిన బాల గణేష్ గా పోలీసులు గుర్తించారు. కర్నూలులోని దేవరగట్టులో జరిగిన ఈ ఉత్సవాల్లో దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఇనుపరింగుల కర్రలతో కర్రల సమరానికి దిగారు. అయితే, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగుతున్న టైంలో కొంతమంది కాగడాల దివిటీలను గాలిలోకి ఎగివేశారు.. దీంతో గొడవ స్టార్ట్ అయింది.

అయితే, దేవరగట్టు కర్రల సమరాన్ని చూసేందుకు స్థానికులు కొంతమంది ఓ చెట్టు ఎక్కి నిల్చున్నారు. అయితే, ప్రమాదవశాత్తు ఆ చెట్టు కొమ్మ విరిగిపోయింది. అది అక్కడే ఉన్న గణేష్ అనే యువకుడు మీద పడడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా భక్తులు గాయల పాలయ్యారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. కాగా క్షతగాత్రులందరినీ ఆలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం అంబులెన్స్ లో తరలించారు.

తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ మంగళవారం అర్ధరాత్రి బన్నీ ఉత్సవం జరిగింది. మరోసారి దేవరగట్టులో స్థానికుల సంప్రదాయమే గెలిచింది. ఎన్నిసార్లు వారించిన కర్రల సమరం యధావిధిగా కొనసాగించేందుకు మొగ్గు చూపారు. ఏటా విజయదశమి రోజు అర్ధరాత్రి దేవరగట్టుపై వెలసిన మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి ప్రజలు మాల మల్లేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.

అయితే, కళ్యాణోత్సవం తర్వాత ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపుగా జైత్రయాత్రకు బయలుదేరిన సమయంలో గట్టుపై నుంచి కిందకు వచ్చి సింహాసన కట్ట దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ఈ టైంలోనే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట, బిలేహాల్, ఆలూరు, సులువాయి, ఎల్లార్తి గ్రామాల మధ్య కర్రల సమరం కొనసాగింది. ఈ సమయంలో కొందరు కర్రలను అటు ఇటు ఊపుతూ భయాందోళన గురి చేయడంతో బన్నీ ఉత్సవాల్లో ఉత్కంఠ నెలకొంది.