
బీజేపీ, వైసీపీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పురందేశ్వరి ఏపీ లిక్కర్ స్కాం, ఆర్థిక అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కేంద్రానికి కంప్లైంట్ ఇచ్చారని, ఈ అంశంపై కేంద్రం ఏమి చర్యలు తీసుకుంటుందో, విచారణ జరిపిస్తారో లేదో అమిత్ షా సమాధానం చెప్పాలన్నారు సీపీఐ రామకృష్ణ. బీజేపీ, వైసీపీ కలిసే డ్రామాలు ఆడుతున్నాయంటూ సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా మోడీ, అమిత్ షా, జగన్ ఉమ్మడి పాత్ర వుందని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా.. 679 మండలాల్లో 300 పైచిలుకు మండలాలు దుర్భిక్షంగా మారాయని ఆయన విమర్శించారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని, పట్టిసీమ ద్వారా కృష్ణ డెల్టాకు నీరందించే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2, 3 పంటలు పండే కృష్ణా డెల్టాకు ఖరీఫ్ సీజన్ లో కూడా నీరందే పరిస్థితులు లేకపోతున్నాయని, కరువు సమస్యపై ఆన్ని రాజకీయ పక్షాలతో, రైతు, ప్రజా సంఘాలతో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నామన్నారు సీపీఐ రామకృష్ణ. పుంగనూరులో టీడీపీ కార్యకర్తపై దౌర్జన్యాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు సీపీఐ రామకృష్ణ.