
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో బెంగళూరు-హైదరాబాద్ (ఎన్‌హెచ్ 44)లో గురువారం నాడు నిలిచిన ట్యాంకర్‌ను వారు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ ఢీకొనడంతో పదమూడు మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వలస కూలీలుగా గుర్తించారు. మృతుల్లో తొమ్మిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నట్లు చిక్కబళ్లాపూర్ పోలీసు అధికారి నగేష్ తెలిపారు. ఇది కూడా చదవండి – స్కిల్ స్కామ్: చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది దసరా పండుగను పురస్కరించుకుని వలస కూలీలంతా స్వగ్రామాలకు వెళ్లారు. బాగేపల్లి నుంచి బెంగళూరులోని హొంగసంద్రకు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డుపక్కన నిలిచిన ట్యాంకర్‌ను గమనించలేకపోయిన నరసింహులు అనే ఎస్‌యూవీ డ్రైవర్ దానిని ఢీకొట్టాడు.
ఘటన జరిగినప్పుడు ఎస్‌యూవీలో 14 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది చిక్కబళ్లాపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందుకున్న చిక్కబళ్లాపూర్‌లోని పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే.. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. కర్ణాటకలోని చిక్‌బళ్ళాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసిందన్నారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు సీఎం జగన్. ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నామన్నారు.