Leading News Portal in Telugu

Bhumana Karunakar Reddy: అర్హత ఉంటే నా బిడ్డను గెలిపించండి.. కాదంటే ఓడించండి..


Bhumana Karunakar Reddy: అర్హత ఉంటే నా బిడ్డను గెలిపించండి.. కాదంటే ఓడించండి..

Bhumana Karunakar Reddy: రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లలో అంచెలంచెలుగా ఎదిగి, తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పైరవీలతో వచ్చిన వాడు కాదు.. ఫైటర్ గా రాజకీయాల్లోకి వచ్చినవాడు వైఎస్‌ జగన్‌ అంటూ ప్రశంసలు కురిపించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి.. తిరుపతిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. నక్సల్ బరి ఉద్యమ ప్రభావంతో 1972లో ర్యాడికల్ పోరాటంలో ముందున్న వాడిని నేను అని గుర్తుచేసుకున్నారు.. ఎమర్జెన్సీ విధించిన సమయంలో నేను అత్యంత పిన్నవయసులో అరెస్ట్ అయిన వాడ్ని.. దేశం కోసం ఆ రోజు త్యాగం చేశామన్నారు.. ఇక, నా కుమారుడు అభినయ్‌ను అదేవిధంగా పెంచాను అన్నారు.. నా కుమారుడు తాగుబోతు కాదు, భూ కబ్జాదారుడు కాదు, తిరుగుబోతు కాదు.. అని ధైర్యంగా చెప్పగలను అని పేర్కొన్నారు.

ఇక, జైల్లో ఉన్న సమయంలో వైఎస్ రాజారెడ్డితో పరిచయం ఏర్పడింది, ఆనాటి నుంచి ఆ కుటుంబంతో ఉన్నాం అని గుర్తుచేసుకున్నారు కరుణాకర్‌ రెడ్డి.. 40 ఏళ్లలో ఎక్కడ లేని అభివృద్ధి తిరుపతిలో చేసి చూపించాం.. తిరుపతి అభివృద్ధి కోసం మా పోరాటం, ప్రజలకు మేలు చేయడంలో ఎక్కడా రాజీపడలేదన్నారు.. అర్హత ఉంటే నా బిడ్డ అభినయ్‌ను గెలిపించండి, కాదు అంటే ఓడించండి అంటూ పిలుపునిచ్చారు భూమన కరుణాకర్‌రెడ్డి.. కాగా, రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం నుంచి అధికార వైసీపీ అభ్యర్థిగా తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి పేరును ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఖరారు చేసిన విషయం విదితమే.