
విశాఖపట్నంలోని తగరపువలస పుట్ బాల్ గ్రౌండులో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో వైసీపీ మంత్రులు పాల్గొన్నారు. బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమురు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నారా భువనేశ్వరి అడుగుతున్నట్టు నిజమే గెలిచింది అని ఆయన అన్నారు.
దోచుకో.. దాచుకో అనుకున్నందుకు చంద్రబాబు జైలు పాలయ్యాడు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మేం రెండు ఎకరాల్లో ఆదాయాన్నే తిన్నాము.. ప్రజల సొమ్ము దోచుకో లేదని నారా భువనేశ్వరి దేవుడి మీద ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. యాదవులను టీడీపీ ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంది.. నారా చంద్రబాబు, నారా లోకేశ్, దత్తపుత్రుడిని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం అని ఆయన వ్యాఖ్యనించారు. ముఖ్యమంత్రిని సైకో అంటున్న నీ అంతు చూస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. తప్పు చేసి నీ బాబు జైలుకు వెళ్ళాడు అంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంది.. కానీ, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలను ముంచింది అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఏపీలో ఇంకో 20 ఏళ్లు సీఎంగా జగన్ మోహన్ రెడ్డినే ఉంటాడని ఆయన తెలిపారు.