
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 4 కోట్ల 2 లక్షల 21 వేల 450 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ముసాయిదా ఒటర్ల జాబితాను ఆయన నిన్న (శుక్రవారం) విడుదల చేశారు. అయితే, ముసాయిదా ఓటర్లు జాబితా విడుదల నేపథ్యంలో ఓటర్ల జాబితాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఓటర్ల జాబితా అంశాలపై ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒక ఇంఛార్జ్ నియామకం చేసేందుకు యోచిస్తుంది.
అయితే, ఈ నెల 31వ తేదీన వైసీపీ ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. 175 నియోజక వర్గాల నుంచి పార్టీ ఇన్ చార్జ్ లు హాజరుకానున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో వర్క్ షాపు జరుగనుంది. పార్టీ సెంట్రల్ ఆఫీసులో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. నియోజకవర్గానికి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇక, ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై ఫోకస్ గా ఈ వ్యవస్థ పని చేయనుంది. డిసెంబర్ 9వ తేదీ వరకు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది.
ఇక, ఏపీలో ప్రస్తుతం 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నట్లు సీఈవో ముఖేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ముసాయిదా ఒటర్ల జాబితాను ఆయన విడుదల చేశారు. దీని ప్రకారం పురుషులు 1,97,66,013 మంది ఉండగా, మహిళలు 2,03,83,471 మంది ఉన్నారు. ఇక, థర్డ్‌జెండర్ 3,808 మంది ఓటర్లుగా నమోదు అయింది. సర్వీస్ ఓటర్లు పురుషులు 65,778 మంది, మహిళా ఓటర్లు 2,380 మంది ఉన్నట్లు తెలిపింది. ఈ జాబితాపై డిసెంబరు 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.