Leading News Portal in Telugu

Gidugu Rudraraju: రైతుల పరిస్థితి దుర్భరం.. సీఎం వెంటనే కరువు మండలాలు ప్రకటించాలి..


Gidugu Rudraraju: రైతుల పరిస్థితి దుర్భరం.. సీఎం వెంటనే కరువు మండలాలు ప్రకటించాలి..

Gidugu Rudraraju: ఆంధ్రప్రదేశ్‌లో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది.. సీఎం వైఎస్‌ జగన్‌ వెంటనే కరువు మండలాలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ వదిలి రైతుల కష్టాలపై దృష్టి సారించాలన్న ఆయన.. సీఎం జగన్ పొలం బాట పడితే రైతుల కష్టాలు తెలుస్తాయి.. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి రైతులు తీవ్రంగా నష్టపోయారు.. వర్షాభావం వలన పంట పొలాలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ఈ సంవత్సరం రైతులు సుమారు 40 వేల ఎకరాలు సాగుచేయలేదన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.. ముఖ్యమంత్రి వెంటనే కరువు మండలాలు ప్రకటించాలని కోరారు.

ఇక, నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు గిడుగు రుద్రరాజు. ఇటీవల చిగ్బల్లాపూర్ లో ఏపీ రైతులు వలసపోతూ రోడ్డుప్రమాదంలో చనిపోవడం బాధాకరం అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది.. ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు.. సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాలకోసం పని చేయాలి.. మన రాష్ట్రంలో ఉపాధిలేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్నారు.. కరువు జిల్లాలు, మండలాలు ప్రకటించాలి.. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు. సమాజంలో కులగణన జరిగితే.. ఆ సంఖ్యా బలాన్ని బట్టి ఆయా కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. రేపు గుంటూరులో ఓబీసీ సమావేశం నిర్వహించనున్నాం.. ఏపీ కాంగ్రెస్ లో మంచి నాయకులు ఉన్నారు.. రానున్న రోజుల్లో సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించి వారి సలహాలు తీసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రకటించారు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.