Leading News Portal in Telugu

Samajika Sadhikara Bus Yatra: సామాజిక సాధికార యాత్ర.. మూడో రోజు షెడ్యూల్ ఇదే..


Samajika Sadhikara Bus Yatra: సామాజిక సాధికార యాత్ర.. మూడో రోజు షెడ్యూల్ ఇదే..

Samajika Sadhikara Bus Yatra: తన పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందజేసిన సంక్షేమ పథకాల ఫలాలను వివరిస్తూ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్ర పేరుతో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బస్సు యాత్రలు చేపట్టింది.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర.. ఇలా మూడు ప్రాంతాల్లో ఒకేసారి యాత్రలు నిర్వహిస్తున్నారు.. డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని.. తన ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు.. అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తున్నారు.. ఇప్పటికే రెండు రోజుల పాటు ఈ యాత్రలు విజయవంతంగా సాగగా.. మూడో రోజు షెడ్యూల్‌ ఇలా ఉండనుంది..

ఉత్తరాంధ్ర విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో మూడో రోజు సామాజిక సాధికార యాత్ర నిర్వహించనున్నారు.. మంత్రులు బొత్స సత్యనారాయణ, సిదిరి అప్పలరాజు, కార్మూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, విడదల రజినీ, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఇతర నేతలు పాల్గొననున్నారు.. మధ్యాహ్నం 12:30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది.. ఇక, విశాఖపట్నం జిల్లా పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం ఉంటుంది.. మధురవాడ చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్లో నాడు-నేడు పనులను పరిశీలిస్తారు.. మధ్యాహ్నం 2 గంటలకు బోయపాలెంలో భోజన విరామం ఉండగా.. మధ్యాహ్నం 3 గంటలకు తగరపువలస గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఇక, కోస్తా రీజన్ విషయానికి వస్తే బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర జరగనుంది.. మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పార్థసారథి, ఇతర ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొననున్నారు.. మధ్యాహ్నం 12 గంటలకు చందోల్ లో దేవాలయంలో ప్రత్యే పూజలు.. 12:30కు పెద్ద మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.. ఇక, చందోల్ జడ్పీ హైస్కూల్ లో నాడు -నేడు పనులను సందర్శించనున్నారు.. సాయంత్రం 4 గంటలకు జడ్పీహెచ్ఎస్ నుంచి కర్లపాలెం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు.. సాయంత్రం 5 గంటలకు బాపట్ల అంబేద్కర్ సెంటర్ దగ్గర బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు.

మరోవైపు రాయలసీమ రీజన్ విషయానికి వస్తే.. నేడు కడప జిల్లా ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర నిర్వహించనున్నారు.. డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, బుట్టా రేణుక, ఆకేపాటి అమర్నాథ్, ఇతర నేతలు పాల్గొన్నారు.. మధ్యాహ్నం 12 గంటలకు వైవీఆర్ ఫంక్షన్ హాల్ లో స్థానికులతో సమావేశం జరగనుంది.. ఒంటిగంటకు మీడియా సమావేశం నిర్వహిస్తారు.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు రామేశ్వరం నుంచి శివాలయం సర్కిల్ వరకు బైక్, ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నారు.. సాయంత్రం 5 గంటలకు శివాలయం సర్కిల్ దగ్గర బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లలో మునిగిపోయాయి వైసీపీ శ్రేణులు.