
BJP Leader Vishnu Kumar Raju Fires on YCP MP Vijaysai Reddy: జనసేన-టీడీపీ కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రాకుండా పార్టీలన్నీ కలవాలని, రాక్షస రాజ్యం నుంచి సుపరిపాలనకు ప్రజలు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు అసలు బుద్ది ఉందా? అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై గోరంట్ల చేసిన వ్యాఖ్యలపై విష్ణుకుమార్ మండిపడ్డారు.
ఆదివారం విశాఖలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ… ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నా అన్నారు. ఓ అధ్యక్షురాలిపై అలా వ్యాఖ్యలు చేయడం సరికద్దన్నారు. పురందేశ్వరికి ఓ నియోజకవర్గం లేదని.. స్వార్ధ, కుటుంబ, సొంత అజెండాతోనే ఆమె రాజకీయం చేస్తున్నారని విజయసాయి తాజాగా ఆరోపించారు. పురందేశ్వరికి తెలిసింది ఆమె సామాజిక వర్గం గురించి మాత్రమేనని, ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని హితవు పలికారు.
‘ఏపీలో లిక్కర్ స్కామ్ చాలా పెద్దది. వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సిగ్గు ఉందా. వైసీపీలో నికృష్టమైన నేతలు ఉన్నారు. శత్రువుపైన కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. కానీ గోరంట్ల ఆలా కాదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి రాకుండా పార్టీలన్నీ కలవాలి. రాక్షస రాజ్యం నుంచి సుపరిపాలనకు ప్రజలు శ్రీకారం చుట్టారు. వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. జనసేన-టీడీపీ కలయికతో ప్రజలకు మంచి జరుగుతుంది’ అని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.