
Venkaiah Naidu: అమరావతిలోని ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టులో ఏబీవీపీ అమృతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏబీవీపీలో పని చేసిన ప్రస్తుత, పూర్వ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. దేశంలో ఏబీవీపీ విస్తరిస్తోందని అన్నారు. గౌహతిలో జరిగిన తొలి జాతీయ మహా సభకు హజరయ్యానని తెలిపారు. ఏబీవీపీలో పని చేసే సమయంలో పిరాట్ల సంఘటన ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడినని పేర్కొన్నారు.
తనకు నాయకత్వంలో తర్ఫీదు ఇచ్చింది ఏబీవీపీనేనని వెంకయ్య నాయుడు తెలిపారు. శక్తి వంతమైన సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని కొనియాడారు. ఏబీవీపీ వల్లనే తాను అంచెలంచెలుగా జాతీయ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. రాజకీయాలను అధ్యయనం చేయాలని.. మంచి ఆలోచనలు స్వాగతించాలని వెంకయ్య నాయుడు తెలిపారు. కులము కుర్చీ ఇవ్వదని అన్నారు. వ్యక్తి నిర్మాణం విద్యతో వస్తుందని.. వేదాల్లో సారం తెలుసు కోవాలని పేర్కొన్నారు. రేపటి భారత దేశం పటిష్టంగా ఉండాలని వెంకయ్య నాయుడు తెలిపారు.