Leading News Portal in Telugu

TDP Complaints: ఏపీలో ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదులు.


TDP Complaints: ఏపీలో ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదులు.

ఏపీలో ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదులు చేసింది. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సీబీఐ, సీవీసీలకు టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల లేఖలు రాశారు. ఎంఎస్టీసీ వేదికగా ఇసుక అక్రమాలకు ఏపీ ప్రభుత్వం తెర లేపిందని టీడీపీ లేఖల్లో పేర్కొంది. ఎన్జీటీ నిబంధనలకు విరుద్దంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ ఎంపీలు ఆరోపణలు చేశారు.

ప్రభుత్వ పెద్దల బినామీలకు దక్కేలా టెండర్లు రూపొందించారని టీడీపీ ఆరోపించింది. గతంతో పోల్చుకుంటే సెక్యూర్టీ డిపాజిట్ మొత్తాన్ని చాలా వరకు తగ్గించారని వారు లేఖలో పేర్కొన్నారు. నాన్ రిఫండబుల్ టెండర్ డాక్యుమెంట్ ధరను ఏకంగా రూ. 29.50 లక్షల మేర వసూలు చేయడం ద్వారా కాంపిటీషన్ ను తగ్గించే ప్రయత్నం చేశారని లేఖలో వెల్లడించారు.

ప్రీ-బిడ్ మీటింగ్ ఏపీలో కాకుండా రహస్యంగా కోల్ కత్తాలో నిర్వహించారని సీబీఐ, సీవీసీలకు ఎంపీలు వివరించారు. ఏమైనా ఆరోపణలు వస్తే ఎంఎస్ఎస్టీ మీదకు నెట్టేసేలా పక్కా వ్యూహంతో ఇసుక దోపిడీకి తెర లేపారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఏపీలోని ఇసుక దోపిడీ కోసం జరుగుతున్న టెండర్ల ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని సీబీఐ, సీవీసీలను టీడీపీ కోరింది.