Leading News Portal in Telugu

Purandeswari: ఏపీలో ఇసుక దోపిడీ..! పురంధేశ్వరి సంచలన ఆరోపణలు


Purandeswari: ఏపీలో ఇసుక దోపిడీ..! పురంధేశ్వరి సంచలన ఆరోపణలు

Purandeswari: ఏపీలోని ఇసుక దోపిడీ జరుగుతోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. కోట్లాది రూపాయల మేర ఇసుక దోపిడీ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.. ప్రజా సమస్యలని ప్రస్తావించడం మా ప్రధాన అజెండాగా స్పష్టం చేసిన ఆమె.. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. నేను వివిధ అంశాలను ప్రస్తావిస్తోంటే.. నాపై విమర్శలు చేశారని మండిపడ్డారు. ఏపీలో ఇసుక దోపిడీ జరుగుతోంది.. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ. వేయి లభించేది.. కానీ, ఇప్పుడు రూ. 5-6 వేలుగా ఉందన్నారు.. ఇసుక ధరలు పెరగడం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక ధర పెరగడంతో నిర్మాణ రంగం కుదేలైందని.. దీంతో సుమారు 35 లక్షల మంది ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీని మార్చి.. ఒకే కాంట్రాక్టరుకు ఇచ్చారు. ఎవ్వర్నీ పోటీకి రానివ్వకుండా జేపీ వెంచర్స్‌కు కట్టబెట్టారు.. సబ్ లీజ్ ఇవ్వకూడదనే నిబంధన ఉంది.. కానీ, దానిని ఉల్లంఘించారని దుయ్యబట్టారు పురంధేశ్వరి. శేఖర్ రెడ్డికి సంబంధించిన టర్న్ కీ ఎంటర్‌ప్రైజెస్‌కు జేపీ వెంచర్స్ సంస్థ సబ్ లీజుకు ఇచ్చింది. సబ్ లీజ్ తీసుకున్న టర్న్ కీ సంస్థను పంపేసి.. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అనధికారికంగా కట్టబెట్టారని ఆరోపించారు. జిల్లాల వారీగా ఇసుక రీచ్‌లను అమ్మేశారు. ఇసుక దోపిడీలో భాగంగా తాడేపల్లి ప్యాలెస్‌కు రూ. 2 వేల కోట్లు వెళ్లాయని సంచలన ఆరోపణలు గుప్పించారు.. హైదరాబాద్‌లోని సుధాకర్ అనే వ్యక్తి ఈ ఇసుక దందాను పర్యవేక్షిస్తున్నారు. ఇసుక దోపిడీకి ఓ ఐఏఎస్ అధికారి సహకరిస్తున్నట్టు మాకు సమాచారం ఉందన్నారు. జేపీ వెంచర్స్ సంస్థతో ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఇంకా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు.. అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.. బిల్లుల్లో ఉండే లెక్కలకూ.. జరుపుతోన్న తవ్వకాలకు భారీ వ్యత్యాసం ఉందని విమర్శించారు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపకూడదనే నిబంధనలున్నాయి.. కానీ, దాన్ని ఉల్లంఘిస్తున్నారు. నదీ గర్భంలో తవ్వకాలు జరపకూడదనే నిబంధనలున్నా.. రోడ్లు వేసి మరీ డీప్ డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు. వర్షాకాలంలో తవ్వకూడదనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. పరిధిని మించి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి అంటూ ఆరోపణలు గుప్పించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.