Leading News Portal in Telugu

Chandrababu: చంద్రబాబు బెయిల్‌ షరతులపై హైకోర్టులో విచారణ


Chandrababu: చంద్రబాబు బెయిల్‌ షరతులపై హైకోర్టులో విచారణ

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ నేపథ్యంలో మరికొన్ని షరతులు విధించాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు ఎల్లుండి(నవంబర్‌ 3)కి వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. కేసుకు సంబంధించిన అంశాలు మీడియాతో మాట్లాడకూడదు.. రాజకీయ సమావేశాలు, సభలు, ర్యాలీల్లో పాల్గొనకూడదంటూ షరతులను సీఐడీ ప్రతిపాదించింది. సీఐడీ షరతులపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.

కోర్టు ఆదేశాలను చంద్రబాబు ఎక్కడా అతిక్రమించలేదని.. ఆయన మాట్లాడటం అనేది ప్రాథమిక హక్కులలో భాగమే తప్ప అతిక్రమణ కాదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. జైలు శిక్ష పడిన వారికి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం గతంలో న్యాయస్థానాలు కల్పించాయన్నారు సీఐడీ చెబుతున్న షరతులు ఆయన హక్కులను హరించే విధంగా ఉన్నాయని లాయర్లు కోర్టులో తెలిపారు. ఇదిలా ఉండగా.. జైలు బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారంటూ వీడియో క్లిప్పింగ్స్ను సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు అందజేశారు. ర్యాలీలు నిర్వహించవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా.. రాజమండ్రి నుంచి ర్యాలీగా విజయవాడకు వచ్చారని కోర్టుకు వెల్లడించారు.