Leading News Portal in Telugu

CM YS Jagan: అప్పుడే అన్ని వేళలా, అన్ని ప్రాంతాలకు నీటి లభ్యత..


CM YS Jagan: అప్పుడే అన్ని వేళలా, అన్ని ప్రాంతాలకు నీటి లభ్యత..

CM YS Jagan: నీటిని ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ కు తరలించే వ్యవస్థలు ఏర్పాటు కావాలి.. అప్పుడే అన్ని వేళలా, అన్ని ప్రాంతాలకు నీటి లభ్యత ఉంటుందన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. విశాఖపట్నంలో 25వ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ (ఐసీఐడీ) కాంగ్రెస్‌ ప్లీనరీని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాల సీజన్ క్రమేపీ తగ్గిపోతుంది.. దిగువ నదీ తీర రాష్ట్రంగా నీటి నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు.. వంశధార, నాగావళి, కృష్ణ, గోదావరి నదులు ఉన్నా అతివృష్టి, అనావృష్టి వల్ల నీటి నిర్వహణ పెద్ద సవాల్ గా మారిందన్నారు.. వర్షాలు కూడా చాలా పరిమిత సమయాల్లోనే కురుస్తుండడం వల్ల ఆ నీటిని ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ కు తరలించే వ్యవస్థలు ఏర్పాటు కావాలి.. అప్పుడే అన్ని వేళలా, అన్ని ప్రాంతాలకు నీటి లభ్యత ఉంటుందన్నారు సీఎం జగన్‌.

సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న ఆయన.. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది.. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలన్నారు.. ఇక, సదస్సు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌కి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, విశాఖ వేదికగా ఇవాళ్టి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు 25వ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ సదస్సు జరగనుంది.. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌తో పాటు రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్, దేశవిదేశాలకు చెందిన 1200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.