Leading News Portal in Telugu

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..


AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..

AP Cabinet: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న కేబినెట్‌ సమావేశ మందిరంలో ఈ సమావేశం కానుంది కేబినెట్.. పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గ సమావేశం.. సుమారు 19 వేల కోట్ల రూపాయాల విలువైన పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.. విశాఖలో ట్రాన్సిట్ అకామిడేషన్ కమిటీ నివేదికపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ కల్యాణ మస్తు – షాది తోఫా మూడో విడత, జగనన్న విద్యా దీవెన మూడో విడతకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఖాళీల భర్తీ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటన, బాధితులకు ప్రభుత్వ పరిహారం, జగనన్న ఆరోగ్య సురక్షా తదితర అంశాల పై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

కాగా, విశాఖ నుంచి పాలన దిశగా వైఎస్‌ జగన్‌ సర్కార్‌ వేగంగా అడుగులు వేస్తుంది. విశాఖలో పరిపాలన భవనాల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ భవనాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసు కోసం గుర్తించిన వివిధ భవనాల వివరాలను అధికారుల కమిటీ సీఎం వైఎస్‌ జగన్‌‌కి వివరించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం పర్యవేక్షణ, సమీక్ష సమావేశాల నిర్వహణకు విశాఖలో క్యాంపు కార్యాలయం చూస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలో గుర్తించిన భవనాల వివరాలను సీఎం వైఎస్‌ జగన్‌కు కమిటీ వివరించింది. రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారులు సహా, ఇతర అధికారులు తమ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన భవనాలను కూడా గుర్తించినట్లు పేర్కొంది.. విశాఖలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాలు, వాటి కార్యాలయాలు 2,27,287 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని కమిటీ సీఎంకు వివరించింది.. వీటిలో సీనియర్‌ అధికారులకు అవసరమైన క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.. ఐటీ హిల్‌పై ఉన్న మిలీనియం టవర్‌లో అందుబాటులో ఉన్న 1,75,516 అడుగుల విస్తీర్ణంలో మిగిలిన సీనియర్‌ అధికారులు క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. ఇక, రుషికొండ వద్ద నిర్మించిన రిసార్టుల కోసం నిర్మించిన భవనాలు సీఎం క్యాంపు కార్యాలయంకు అత్యంత అనుకూలంగా ఉంటాయని కమిటీ తెలిపిన విషయం విదితమే.