Leading News Portal in Telugu

YSR Rythu Bharosa: రైతులకు సీఎం గుడ్‌న్యూస్‌.. రేపే 53.53 లక్షల మంది ఖాతాల్లో సొమ్ము జమ


YSR Rythu Bharosa: రైతులకు సీఎం గుడ్‌న్యూస్‌.. రేపే 53.53 లక్షల మంది ఖాతాల్లో సొమ్ము జమ

YSR Rythu Bharosa: రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఈ నెల 7వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నగదును రైతుల ఖాతాల్లో బటన్‌ నొక్కి జమ చేయనున్నారు.. ఇక, రేపటి పుట్టపర్తి పర్యటన కోసం.. మంగళవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి వెళ్లనున్నారు.. పుట్టపర్తి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం వైఎస్‌ జగన్.. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.. ఇక, ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి..

ఈ ఏడాది ఇప్పటికే తొలి విడత సాయాన్ని అందజేసింది ఏపీ సర్కార్.. రేపు రెండో విడత సాయాన్ని జమ చేయనున్నారు.. వైఎస్సార్‌ రైతు భరోసా కింద 53.53 లక్షల మంది ఖాతాల్లోకి రూ.2,204.77 కోట్లు జమ చేయనున్నారు.. ఈ ఏడాది తొలి విడతలో రూ.7,500 చొప్పున 52.57 లక్షల మందికి రూ.3,942.95 కోట్ల మేర సాయాన్ని అందించింది వైసీపీ సర్కార్.. ఇక, ఇప్పుడు రెండో విడతగా రూ.4 వేల చొప్పున 53.53 లక్షల మందికి రూ.2,204.77 కోట్లు అందించనుంది.. కాగా, వైఎస్సార్‌ రైతు భరోసా కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడతలో 52,57,263 మంది అర్హత పొందారు. వీరిలో 50,19,187 మంది భూ యజమానులు అయితే.. 1,46,324 మంది కౌలుదారులు, 91,752 మంది అటవీ భూ సాగుదారులున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున తొలి విడతగా జూన్‌ 1వ తేదీన భూ యజమానులకు, సెప్టెంబర్‌ 1న కౌలుదారులు, అటవీ సాగుదారులకు రూ.3,942.95 కోట్ల మేర సాయాన్ని అందించింది ప్రభుత్వం.. ఇక, రెండో విడతలో 53,52,905 మంది అర్హత పొందారు.