
Seediri Appalaraju: విశాఖపట్నంలోని పాత గాజువాక జంక్షన్‌లో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఏపీలో త్వరలో కనుమరుగయ్యే పార్టీ జనసేన పార్టీ అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జనసైనికుల్లారా మీ శ్రమను డబ్బులు కోసం వేరే పార్టీలకు అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో ఒకపార్టీకి, కేంద్రంలో మరో పార్టీకి అమ్మేస్తున్నారని మంత్రి విమర్శించారు. జనసైనికులు ఒకసారి ఆలోచించాలని సూచించారు.
చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసు పెట్టాలన్నారు. చంద్రబాబు బడుగు బలహీన వర్గాల వారిని హీనంగా చూశారని.. కష్టం చెప్పుకోవడానికి వచ్చిన మత్స్యకారులతో అనుచితంగా మాట్లాడారని, అలాగే.. నాయీ బ్రాహ్మణులతో కూడా నీచంగా వ్యవహరించారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అవహేళన చేశారని ఆయన గుర్తుచేశారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చట్టసభలు, కార్పొరేషన్ పదవుల్లో సీఎం జగన్ పెద్దపీట వేశారని సీదిరి అప్పలరాజు చెప్పారు. గతంలో మన పిల్లల బతుకులు మార్చాలన్న ఆలోచన ఏ నాయకుడికీ రాలేదని, కానీ.. జగన్ మాత్రం అమ్మఒడి అందించి పేదల చదువులు ఆగకుండా వారి బతుకుల్లో దీపాలు వెలిగించారని కొనియాడారు.