
AP CM Jagan Tour: రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరి వెళ్లనున్నారు. పుట్టపర్తి బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. వరుసగా ఐదో ఏడాది రెండో విడతగా ఒక్కొక్కరికి రూ. 4,000 చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నారు. 53.53 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ.2,204.77 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు. రేపు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి వర్చువల్‌గా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ నాలుగున్నర ఏళ్లలో రైతులకు వైఎస్సార్ రైతు భరోసా- -పీఎం కిసాన్ పథకం కింద అందించిన మొత్తం సాయం రూ.33,209.81 కోట్లు. ఏటా 3 విడతల్లో రైతులకు రూ. 13,500 ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఏటా 13,500 చొప్పున 5 ఏళ్ళల్లో ఈ పథకం కింద ఒక్కో రైతుకు 67,500 రూపాయల లబ్ధి చేకూరింది.
రేపు పుట్టపర్తికి సీఎం జగన్ రానున్న నేపథ్యంలో పోలీసులు.భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. శాంతిభద్రతలకు ఆటంకాలు కలిగిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.