Leading News Portal in Telugu

Minister Seediri Appalaraju: చంద్రబాబుకు కుల పిచ్చి.. ఆయన సామాజిక వర్గం వారికే పదవులు..!


Minister Seediri Appalaraju: చంద్రబాబుకు కుల పిచ్చి.. ఆయన సామాజిక వర్గం వారికే పదవులు..!

Minister Seediri Appalaraju: చంద్రబాబుకు కుల పిచ్చి ఎక్కువ.. ఆయన సామాజిక వర్గంవారికే పదవులు కట్టబెడతారని ఆరోపించారు మంత్రి సీదిరి అప్పలరాజు.. నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు.. మంత్రి అప్పలరాజుతో పాటు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు.. రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన కొందరికి కనిపించడం లేదు.. కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఇక, సమాజంలో రూపం మార్చుకున్న అంటరానితనాన్ని సీఎం వైఎస్‌ జగన్ అంతం చేశారని తెలిపారు అప్పలరాజు.. చంద్రబాబుకు కుల పిచ్చి ఎక్కువ.. ఆయన సామాజిక వర్గం వారికే పదవులు ఇస్తారన్న ఆయన.. జన్మభూమి కమిటీల పేరుతో పేదలకు సంక్షేమ పథకాలు అందనివ్వకుండా చంద్రబాబు చేశారని ఆరోపించారు. అప్పట్లో కలెక్టర్ల కు కూడా పథకాలు మంజూరు చేసే అధికారం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టంలో ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టని దౌర్బాగ్యుడు చంద్రబాబు అని మండిపడ్డారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని లేఖ రాసిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బీసీలే బుద్ధి చెబుతారు అంటూ జోస్యం చెప్పారు.. దళితులను కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబును దళితులు గుర్తుపెట్టుకోవాలి సూచించారు మంత్రి సీదిరి అప్పలరాజు.

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన మాట తప్పరని వైఎస్‌ జగన్ పై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వం ద్వారా ఒకో కుటుంబానికి వేల రూపాయల మేర లబ్ది చేకూరుతోందని వెల్లడించారు. కావలికి రామాయపట్నం పోర్టు రావడం ప్రజల అదృష్టం.. దీని ద్వారా కావలి కనక పట్నం కాబోతుందన్నారు. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బార్ ను త్వరలోనే సీఎం వైఎస్‌ జగన్ ప్రారంభిస్తారని తెలిపారు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.