Leading News Portal in Telugu

TDP Atchannaidu: ఏపీ వాలంటీర్ వ్యవస్థపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం: అచ్చెన్నాయుడు



Achannaidu

ఏపీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘంతో మంగళవారం సమావేశమైంది. ఈసీతో భేటీ అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో దొంగ ఓట్ల చేర్పులు, ఓట్ల తొలగింపులు, టీడీపీ ఓట్లు టార్గెట్ గా తొలగించడం, వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడం వంటి అంశాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ‘అక్టోబర్ 27 వరకు ఓటర్ వెరిఫికేషన్ దేశమంతట జరిగింది. కానీ ఏపీ రాష్ట్రంలో మాత్రం ఓటర్ వెరిఫికేషన్ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నిర్వహణ అంతా కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరుగుతుంది.

ఏపీలో కొత్త ఓట్లు నమోదు చేసుకోవడానికి ఫారం సిక్స్ ఓటు తొలగించుకోవడానికి ఫారం సెవెన్ ఉంది. ఓటర్‌కి సమాచారం ఇవ్వకుండానే ఓట్లను తొలగిస్తూన్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. కుటుంబంలో నలుగురు ఉంటే.. నాలుగురు ఓట్లను వివిద బూతుల్లో చేర్చారు. ఒకే కుటుంబంలో ఉన్న ఓట్లను ఇష్టానుసారంగా మార్పులు చేశారు. ఒకే మనిషికి రెండు ఓట్లు ఉన్నాయి వాటికి సంబంధించిన ఆధారాలను రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇచ్చాము. వాలంటరీ వ్యవస్థను ఉపయోగించి టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారు. ఈ అంశానికి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపాం’ అన్నారు. ‘160 పోలింగ్ స్టేషన్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. వీటిని మార్పు చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు చెప్పాం. కానీ, దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

రాష్ట్ర ప్రభుత్వం వై నీడ్స్ జగన్ అని కార్యక్రమం పెట్టారు, దాంట్లో గ్రామ సచివాలయం అధికారులను నియమించారు. ఏపీ రాష్ట్రంలో జగన్ సొంత వ్యవస్థను ఉపయోగించి ఎన్నికలు జరుపుతున్నారు. గ్రామ సచివాలయం ఉద్యోగులను వచ్చే ఎన్నికల్లో విధుల్లో నియమించవద్దని ఈసీకి విజ్ఞప్తి చేశాము. అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను వైసీపీ నేతలు చెప్పినట్టు చేయకపోతే వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కేంద్ర సర్వీసులో ఉన్న అధికారులను ఏపీలోని జిల్లాలకు ఇంచార్జ్‌లుగా నియమించాలి. అధికారులు ఓటర్ లిస్ట్ తనిఖీ చేయాలని కోరాం. చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు‘ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో అచ్చెన్నాయుడుతో పాటు కనకమేడల రవీంద్ర కుమార్, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బోండా ఉమ పాల్గొన్నారు.