
Minister Amarnath: విశాఖ రావాలన్న సీఎం నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. విజయవాడ నుంచి విశాఖకు వస్తుంటే ఎందుకు అభ్యంతరమో వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్పాలన్నారు. సీఎం ఎక్కడ నుంచైనా ప్రజల కోసం పాలన సాగించవచ్చన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం వికేంద్రీకరణ నిర్ణయంలో భాగంగా కార్యాలయాల ఏర్పాటుకు జీవో విడుదలపై ఉత్తరాంధ్ర ప్రజల తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఎక్కడ నుంచి సేవ ఇచ్చిన జీవోలో ఉందన్నారు. పొలిటికల్ టూరిస్టులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వికేంద్రీకరణ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.
Also Read: Seediri Appalaraju: విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష.. ఇక అక్కడి నుంచే పాలన!
అమరావతి అనే భ్రమను ప్రజల్లో ఇంకా ఉంచాలని చూస్తున్నారన్నారు. సీఎం జగన్ వైజాగ్ వస్తే తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం పోతుందన్న భయం టీడీపీలో ఉందన్నారు. ఉత్తరాంధ్రకు మంచి భవిష్యత్తు తీసుకువస్తున్న సీఎం నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలు మద్దతుగా నిలుస్తారన్నారు. ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్ర నుంచి ఉత్తమ ఆంధ్రగా మార్చడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని మంత్రి చెప్పారు. బోటు ప్రమాదంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని.. అగ్నిప్రమాద బాధితులు ఊహించిన దానికంటే అధిక సహాయం జరిగిందన్నారు. మత్స్యకారులు సంతోషంగా వున్నారని మంత్రి పేర్కొన్నారు. దత్త పుత్రుడు ఈ రోజు 50వేలు ఇస్తామని, రేపు టీడీపీ నాయకులు లక్ష ఇస్తామని వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయం కోసం తప్ప దత్త పుత్రుడికి ప్రజలపై ప్రేమ లేదన్నారు.