Leading News Portal in Telugu

Vizag Capital: వైజాగ్‌ నుంచి పాలనకు ముహూర్తం ఫిక్స్.. ఏర్పాట్లలో మునిగిపోయిన అధికారులు


Vizag Capital: వైజాగ్‌ నుంచి పాలనకు ముహూర్తం ఫిక్స్.. ఏర్పాట్లలో మునిగిపోయిన అధికారులు

Vizag Capital: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎక్కడ.. ఇన్నాళ్ల ప్రశ్నకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం దాదాపుగా సమాధానం ఇచ్చేసింది. మూడు రాజధానుల ఏర్పాటుపై వడివడిగా అడుగులేస్తున్న జగన్ సర్కార్.. విశాఖ నుంచి పాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసింది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాల వల్ల ఇన్నాళ్లూ జాప్యం జరిగినా.. డిసెంబర్ 8వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

విశాఖ నుంచి సీఎం జగన్ పాలనకు సంబంధించి మంత్రి సిదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ మొదటి వారం నుంచి విశాఖ వేదికగా సీఎం జగన్ పాలన ప్రారంభమవుతుందన్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ప్రకటించారన్నారు. విశాఖను రాజధాని చేయడం ద్వారా 50 ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు సిదిరి.

ఇక, డిసెంబరు నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభమవుతుందని ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనకు అనుగుణంగా.. రాజధాని తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాలను కమిటీ గుర్తించింది.. సీఎం, మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగం కమిటీ, ఆర్థిక శాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ కార్యదర్శిల నివేదిక ఆధారంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. 35 శాఖలకు కార్యాలయాలు ఏర్పాటుకు సంబంధించి జీవో వెలువడింది. మంత్రులు, హెచ్‌వోడీలు, ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయించింది. అయితే.. సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడనేది జీవోలో పేర్కొనలేదు. దీంతో.. డిసెంబర్‌లో పరిపాలన ప్రారంభమైతే.. సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. అంతే కాకుండా.. పాలన వికేంద్రీకరణ జరిగితేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.