
PM Modi Visits Tirumala: ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.. రాత్రి తిరుమలకు చేరుకుని రచనా అతిధి గృహంలో బస చేసిన ఆయన.. ఈ ఉదయం శ్రీవారి ఆలయానికి చేరుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ఆలయ మహాద్వారం వద్ద ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఇక ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న ప్రధానికి.. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. తదనంతరం ప్రధానికి టీటీడీ ఛైర్మన్, ఈవో.. స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. దాదాపు 50 నిముషాల పాటు శ్రీవారి ఆలయం, పరిసరాల్లో గడిపారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ తర్వాత తిరిగి రచనా అతిథి గృహానికి చేరుకున్నారు..
శ్రీవారి దర్శనార్థం ఆదివారం రాత్రే తిరుమలకు చేరుకున్నారు ప్రధాని.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయంలో దిగిన ఆయనకు స్వాగతం పలికారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్.. పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించి సాదర స్వాగతం పలికారు. ఇక, రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుమలలో రచనా అతిథి గృహానికి చేరుకున్న ప్రధాని మోడీకి.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, రచనా టెలివిజన్స్ డైరెక్టర్ తుమ్మల రచనా చౌదరి స్వాగతం పలికారు.. మరోవైపు.. తిరుమల నుంచి మళ్లీ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బయల్దేరనున్నారు ప్రధాని మోడీ.. ఎన్నికల ప్రచారం తర్వాత.. రాత్రికి ఎన్టీవీ, భక్తి టీవీ నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవంలో ఆయన పాల్గొననున్నారు.