
Cyclone threat to AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం.. పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి రేపటికి వాయుగుండంగా మారుతుందని అమరావతి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆపై వాయవ్య దిశగా కదిలి.. డిసెంబర్ 2 వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని పేర్కొంది.
డిసెంబర్ మొదటి వారంలో తుపాను తీరం దాటొచ్చని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 4 నుంచి 6 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇక నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైయస్‌ఆర్ జిల్లాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా రాపూరులో 8.8 సెంమీ వర్షపాతం కురిసింది.