Leading News Portal in Telugu

Telangana Assembly Elections 2023: తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో జోరుగా బెట్టింగులు..!


Telangana Assembly Elections 2023: తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో జోరుగా బెట్టింగులు..!

Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.. మంగళవారం సాయంత్రం 5 గంటలకే ప్రచారానికి తెరపడింది.. ఇప్పుడు ప్రలోభాల పర్వం జోరుగా సాగుతున్నట్టు కొన్ని ఘటనలు చూస్తే అర్థమవుతోంది.. గురువారం రోజు పోలింగ్‌ జరగనుండగా.. డిసెంబర్‌ 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఎన్నికల ఫలితాలపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయట.. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కోట్ల రూపాయలు పందెం కాస్తున్నారట బెట్టింగ్ రాయుళ్లు.. మరోసారి బీఆర్ఎస్‌ అధికారంలోకి వస్తుందా? తెలంగాణలో కాంగ్రెస్‌ బోణీ కొడుతుందా? బీజేపీకి వచ్చే స్థానాలు ఎన్ని? ఇలా పందెం కాస్తున్నారట.

ఏ సీజన్‌ అయినా క్యాష్‌ చేసుకునే బెట్టింగ్‌ రాయుళ్లు.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై పడ్డారు.. బీఆర్ఎస్‌ హ్యాట్రిక్ కొడుతుందా? కాంగ్రెస్ తెలంగాణ వచ్చిన తర్వాత బోణీ కొడుతుందా? అంటూ భారీగా పందెం కాస్తున్నారట.. మరోవైపు, కామారెడ్డిలో గెలిచేది కేసీఆరా? లేదా రేవంత్ రెడ్డియా? గజ్వేల్‌లో విజయం కేసీఆర్‌ని వరిస్తుందా? ఈటల వైపు జనం మొగ్గుచూపుతారా? కొడంగల్‌లో రేవంత్‌ పరిస్థితి ఏంటి? నల్గొండలో కోమటి రెడ్డి బ్రదర్స్ విజయం సాధిస్తారా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మెజార్టీ ఎంత ఉండొచ్చు? ఇలా అనేక రకాలుగా బెట్టింగ్‌లు వేస్తున్నారట.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంతో పాటు.. టాప్‌ లీడర్ల గెలుపు, ఓటమిలపై కూడా అభ్యర్థుల వారీగా ఒకటికి మూడు రెట్లు ఇస్తాం.. ఒకటికి రెట్టింపు ఇస్తామంటూ పందెం కాస్తున్నారట బెట్టింగ్‌ రాయుళ్లు.