
EX MLA Vishweshwar Reddy: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్‌ను బెదిరించేలా పయ్యావుల వ్యవహరిస్తున్నారని, అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా పయ్యావుల ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో 30 వేల దొంగ ఓట్లు పయ్యావుల కేశవ్ నమోదు చేయించారని ఆయన విమర్శించారు. దొంగ ఓట్లు తొలగిస్తే తప్పేంటి అంటూ ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో నివసిస్తున్న వారి ఓట్లు ఉరవకొండ నియోజకవర్గంలో ఎందుకు ఉండాలని ప్రశ్నలు గుప్పించారు. దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌దే అంటూ ఉరవకొండ నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
ఓడిపోతాన్న భయంతో కేశవ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మన జిల్లాకు సంబంధం లేని రఘురామకృష్ణంరాజు చేత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించారని అన్నారు. ఇదంతా కేశవ్ ఓటమి భయానికి నిదర్శనమన్నారు. టీడీపీ తన దొంగ ఓట్లను కాపాడుకోవడానికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. అధికారులు టీడీపీ నేతల బెదిరింపులకు భయపడవద్దన్నారు. నిష్పక్షపాతంగా పని చేయండి అండగా ఉంటామని అధికారులకు సూచించారు. కేశవ్ బ్లాక్ మెయిల్ రాజకీయాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతామని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని ఆయన అన్నారు. అనంతపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ ప్రెస్‌మీట్‌లో పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సీపీ వీరన్న, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ కేవీ రమణ పాల్గొన్నారు.