Leading News Portal in Telugu

Ambati Rambabu: టీడీపీ, జనసేనది అనైతిక కలయిక.. ఏపీ ప్రజలు క్షమించరు..


Ambati Rambabu: టీడీపీ, జనసేనది అనైతిక కలయిక..  ఏపీ ప్రజలు క్షమించరు..

Ambati Rambabu: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్‌కు అభిమానులు ఎవరు నిలబడరు అని ఆయన అన్నారు. తనకు బ్యానర్లు కట్టడానికి వచ్చిన వాళ్లను కూడా చంద్రబాబుకు బ్యానర్లు కట్టమని పంపిస్తున్నాడని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌కు బ్యానర్లు కట్టిన వారిని కూడా జగన్ మంత్రిని చేశారని.. అది జగన్‌కు ఉన్న ఖలేజా అని మంత్రి వెల్లడించారు. ఇప్పుడున్న క్యాడర్ కూడా జనసేనకు నిలబడరని ఆయన చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్‌ను తిట్టిన చంద్రబాబును, లోకేష్‌ను భుజాన్ని వేసుకొని తిరుగుతున్నాడన్నారు. మా అమ్మను తిట్టావు, లోకేష్ నిన్ను క్షమించను అని చెప్పిన పవన్ కళ్యాణ్ , ఇప్పుడు అదే లోకేష్‌ను వెంటేసుకుని తిరుగుతున్నాడని అన్నారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ , ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తుందన్నారు. అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే సంబరాలు చేసుకోవాలని టీడీపీ క్యాటరింగ్ సిద్ధంగా ఎందుకు ఉందో ఆలోచించుకోవాలన్నారు. చంద్రబాబు, లోకేష్‌ల నాయకత్వంలో టీడీపీ దిగజారి పోయిందన్నారు. టీడీపీ, జనసేన కలయికను ఏపీ ప్రజలు క్షమించరన్నారు. టీడీపీ, జనసేనది అనైతిక కలయిక అంటూ ఆయన విమర్శించారు. జనసేనకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరన్న ఆయన.. ఇప్పుడు టీడీపీ సీట్లు ఇస్తే అక్కడ నిలబెట్టడానికి కూడా అభ్యర్థులు లేరన్నారు. డబ్బు తీసుకొని టీడీపీని గెలిపించాలన్న పవన్ కళ్యాణ్ నిర్ణయం బెడిసి కొడుతుందన్నారు. పూటకు ఒక మాట మార్చే పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలు నమ్మరన్నారు. 175 సీట్లలో సగం సీట్లు జనసేన తీసుకుంటుందా? లేక పాతిక కొరకు తీసుకొని టీడీపీ వెనుక నిలబడుతుందో జనసైనికులకు సమాధానం చెప్పాలన్నారు. ఏపీలో దుర్మార్గపు రాజకీయాలకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు తెర లేపారన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏపీ ప్రజలు చూస్తారు అని మంత్రి తెలిపారు.