Ambati Rambabu: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ నాయకత్వంలో ఏపీకి నీళ్ల కోసం పోరాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మన హక్కుల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్రానికి పట్టిన దుస్థితి అన్న ఆయన.. చంద్రబాబు రాష్ట్ర రైతుల ద్రోహిగా మిగిలిపోయాడని తీవ్రంగా విమర్శించారు.
గతంలో సాగర్‌పై నీటి కోసం యుద్ధం చేసి టీడీపీ నేతృతంలోని ఏపీ ప్రభుత్వం ఓడిపోయిందని.. నేడు సీఎం జగన్ నేతృత్వంలో నీటి కోసం జరిగిన పోరాటంలో చర్చలు జరుగుతున్నాయన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణ నీళ్లు తోడుకొని పోతున్న మాట్లాడలేని దుస్థితిలో గత ఏపీ ప్రభుత్వం ఉండేదన్నారు. చంద్రబాబు అసమర్ధత వల్లే తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకునేదని ఆయన అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని ఇష్టారాజ్యంగా తెలంగాణ వాడుకుందన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం నోరెత్తి మాట్లాడలేదు చివరకు నాగార్జున్ సాగర్ కుడికాలువ తాళాలు కూడా తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉంచుకున్నారని ఆయన విమర్శించారు.
మన నీటిని మనం సాధించుకోవడానికి పోలీస్ యాక్షన్ ద్వారా ప్రయత్నం చేస్తే జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారు. మా హక్కులు కాపాడుకోవడం కోసం వెళ్తే అది దండయాత్ర ఎలా అవుతుందని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ దురదృష్ట పరిస్థితులు ఎదురవటానికి ., 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన దిక్కుమాలిన పాలనే కారణమని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుపై ఉన్న కేసుల వల్లే తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయాడని ఆయన ఆరోపించారు. గతంలో కృష్ణా బోర్డుకు ఇండెంట్ ఇవ్వకుండానే తెలంగాణ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా నీటిని వాడుకుందని మంత్రి అన్నారు.