
Amanchi Krishna Mohan: టీడీపీ-జనసేన పొత్తు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆమంచి కృష్ణ మోహన్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్.. టీడీపీకి రాత్రికి రాత్రే మద్దతు తెలపడం కార్యకర్తలు, అభిమానులకు ఇబ్బంది కలిగించిందన్నారు.. ప్రధాని మోడీ నన్ను అర్థం చేసుకున్నారు అని పవన్ చెప్పడం ఆయన అభిమానులు, కార్యకర్తల్లో ఉన్న నిస్పృహ ను అర్ధం చేసుకోవచ్చు అన్నారు. పొత్తు ధర్మం పాటించకుండా.. పొత్తులు కుదుర్చుకున్నారు.. జనసేనతో ఖచ్చితంగా కాపు సామాజికవర్గం ఉంది.. జనసేనకు పొత్తు ఉపయోగం కాదు.. సామాన్య కాపులు, పవన్ అభిమానులు పొత్తును వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
ఇక, టీడీపీ బలోపేతం కోసమే జనసేన ఎందుకు? అని ప్రశ్నించారు ఆమంచి.. పవన్ పెట్టిన పార్టీకి జస్టిఫికెషన్ ఉండాలిగా? అని నిలదీశారు. జనసేన – టీడీపీ పొత్తుపై త్వరలో మరిన్ని వివరాలు చెబుతా అన్నారు. పొత్తు వెనుక ఉన్న నిజాలు బయటపెడతానని తెలిపారు. మరోవైపు.. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి భాష బాలేదు అని దుయ్యబట్టారు ఆమంచి.. దేశంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ అనే విషయం పురంధేశ్వరి గుర్తుపెట్టుకోవాలన్న ఆయన.. దగ్గుపాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరారు కాబట్టి టీడీపీని వ్యతిరేకించినట్టే.. చంద్రబాబు అరెస్ట్ బంధుత్వం ప్రకారం పురంధేశ్వరిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు అన్నారు.. అసలు, చంద్రబాబు.. తెలంగాణ లో ఎందుకు కాంగ్రెస్ కు మద్దతు పలికారో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఆరోగ్యం బాలేదు అని చెబుతూ.. ఇలాంటి అసహజ రాజకీయాలు చేయడం మంచిది కాదు అని హితవుపలికారు ఆమంచి.. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ ఎప్పుడు కలిసే ఉంటాయన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు మద్దతు ఇస్తే ఓపెన్ గా చెప్పాలన్నారు. ఇక, జనసేనలో 90 శాతం కాపులే ఉన్నారు.. ఏపీ కుల రాజకీయాలకు వేదికగా అభివర్ణించారు. జనసేన – టీడీపీ రెండు భిన్న ధృవాలు.. అయితే, వీరిద్దరూ కలవడం కూడా తప్పు లేదన్నారు. వాళ్లు ఎందుకు కలిసారో జస్టిఫికేషన్ ఉండాలి.. ఇదే విషయాన్ని నేను జనంలోకి తీసుకెళ్తానని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆమంచి కృష్ణ మోహన్.