
Many flights canceled due to Cyclone Michaung in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మిచాంగ్’ తుపాను సోమవారం తీవ్ర రూపం దాల్చింది. గంటకు పది కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్రకు సమాంతరంగా కదులుతుండడంతో.. తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. విపరీతమైన ఈదురుగాలులతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏపీ తడిసి ముద్దయింది. పలు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి.
భారీ వర్షాలకు ప్రధాన వీధుల్లో రాకపోకలు స్తంభించాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారుల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడంతో.. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నేడు, రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పలు విమానాలు రద్దు అయ్యాయి. గన్నవరం నుంచి నడిచే 15 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, షిర్డీ, కడప, ఢిల్లీ విమానాలు రద్దు అయ్యాయి. విశాఖ నుంచి వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దయ్యాయి. నేడు, రేపు పూర్తిస్థాయిలో ఎయిర్ పోర్టు ఆపరేషన్ జరగనుంది.