Minister Karumuri Venkata Nageswara Rao Visits Cyclone affected areas: ‘మిచౌంగ్’ తుపాన్ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. అన్ని విధాలుగా ఆదుకుంటాం అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. సీఎం ప్రతి అంశంపై మానిటరింగ్ చేస్తున్నారని, నష్టపోయిన రైతులు అన్ని విధాల ఆదుకోవాలని అధికారులకు సూచనలు చేశారని తెలిపారు. నేడు విజయవాడ – మచిలీపట్నం హైవే రోడ్డు పరిసర ప్రాంతాలను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తుపాన్ ప్రభావిత పరిస్థితులపై స్పందించారు.
పమిడిముక్కల మండలం గోపువానిపాలెం అడ్డరోడ్డు వద్ద మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగి.. మునిగిన వరి పొలాలను పరిశీలించారు. ‘మిచౌంగ్ తుఫానుతో కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల రైతులకు ఎక్కువ నష్టం జరిగింది. చాలాచోట్ల వరి పంట నీళ్లలో తెలియాడుతుంది. ముఖ్యమంత్రి జగన్ ప్రతి అంశంపై మానిటరింగ్ చేస్తున్నారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలో డ్రయ్యర్ మిల్లులు ఎక్కువగా లేనందున ఇక్కడ ధాన్యాన్ని పల్నాడు, బాపట్ల, ఏలూరు పశ్చిమగోదావరి జిల్లాలకు తరలిస్తున్నాం. ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పౌర సరఫరాల శాఖ తరపున రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని కారుమూరి తెలిపారు.
‘రైతులకు సబ్సిడీ అందించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. మిల్లుల వద్ద లారీల్లో ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన దిగుమతి చేసుకున్నందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను దోచుకునేందుకు ప్రయత్నించే మిలర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు 6 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకున్నాం.1300 కోట్ల రూపాయలకు గాను.. 1070 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశాం. ఆఫ్లైన్లో 1,10,000 టన్నులు ధాన్యం తీసుకున్నాం. కార్డు లేని కౌలు రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని సొసైటీల ద్వారా కొనుగోలు చేస్తాం.. చెల్లింపులు కూడా సొసైటీల ద్వారా చేస్తాం. ఇతర జిల్లాలకు తరలించే ధాన్యానికి ట్రాన్స్పోర్ట్ చార్జీలు రైతులపై పడకుండా చూస్తాం. రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం’ అని మంత్రి కారుమూరి చెప్పారు.