Leading News Portal in Telugu

AP Election Commission: తెలంగాణలో ఓటు వేసినవారిని ఏపీలో ఆపండి..! ఈసీకి వైసీపి ఫిర్యాదు


AP Election Commission: తెలంగాణలో ఓటు వేసినవారిని ఏపీలో ఆపండి..! ఈసీకి వైసీపి ఫిర్యాదు

AP Election Commission: తెలంగాణలో ఓటు వేసినవారిని ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు.. ఈ రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాను కలిశారు మంత్రులు, వైసీపీ నేతలు.. సీఈవోను కలిసిన టీమ్‌లో మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఇతర నేతలు ఉన్నారు.. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఏపీకి చెందిన వారికి 4 లక్షల 30 వేల 264 ఓట్లు ఉన్నాయి. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు అందించాం. డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవో ను కోరాం అన్నారు. దేశంలో ఒకే చోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానం.. ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరాం అన్నారు మంత్రి జోగి రమేష్.

ఇక, ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం వైఎస్‌ జగన్ ఆకాంక్ష.. కానీ, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట.. మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా అంటూ మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయన్న ఆయన.. డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు తాను చేసిన తప్పులు ఇతరులపైకి నెడతారని దుయ్యబట్టారు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్ధాలు చెప్పాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.