
Minister Kottu Satyanarayana: శ్రీశైలం ఆలయ ప్రాకారంపై శిల్పాలను డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీసి స్థల పురాణ గ్రంథాన్ని నిపుణులతో తయారు చేయిస్తామని ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. శ్రీశైలంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు. త్వరలో సాలు మండపాలు క్యూకాంప్లెక్స్ అభివృద్ధి పనులను సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు.
ఏనుగుల చెరువును సుందరీకరణ చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని A6 ఆలయాలలో వారోత్సవాలు చేస్తామన్న మంత్రి.. ప్రధాన ఆలయాలలో ఇప్పటికే మాసోత్సవాలు చేస్తున్నామన్నారు. హిందూ ధర్మాన్ని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని.. హిందూ ధర్మం ఒక మతానికి సంబంధించినది కాదన్నారు. పంచమఠాలను అభివృద్ధి చేసి ఉచితంగా బ్యాటరీ కారులో పంచమఠాలను భక్తులు దర్శించేలా ఏర్పాటు చేస్తామన్నారు.
రెడ్డి రాజుల కాలంలో నిర్మించిన పురాతన మెట్లను పునరుద్ధరణ చేయాలని తీర్మానించామన్నారు. శ్రీశైలంలో మహాకుంభాభిషేకం పీఠాధిపతుల నిర్ణయం ప్రకారం ఉత్తరాయణంలోనే నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. చిన్నపిల్లలకు భగవంతుని ముద్రపడేలా కార్టూన్స్ ఏర్పాటు చేయాలని చెప్పామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఆలయాలలో ఇంజనీరింగ్ క్యాడర్ పెంచడం కోసం చర్యలు తీసుకుని త్వరలోనే క్యాడర్‌ని పెంచుతామని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.