Leading News Portal in Telugu

Karthika Vanabhojanalu: నేడు కాపు, రేపు శెట్టిబలిజ వనభోజనాలు.. పోలీసుల ఆంక్షలు


Karthika Vanabhojanalu: నేడు కాపు, రేపు శెట్టిబలిజ వనభోజనాలు.. పోలీసుల ఆంక్షలు

Karthika Vanabhojanalu: కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. వ్రతాలు, నోములు, పూజలు అంతా ఆధ్యాత్మికలో మునిగిపోతారు.. ఇక, ఇదే సమయంలో ప్రకృతి వనభోజనం కార్తిక మాస పూజా విధుల్లో ముఖ్యమైనది. కార్తిక మాసంలో వనభోజనం ఆచరించడం ఆధ్యాత్మిక, సామాజిక భావనలను పెంచుతుందని నమ్ముతారు. ముక్తికే కాదు సమైక్యతకు, చక్కని ఆరోగ్యానికి దోహదపడుతాయి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతాయని నమ్ముతారు. మరోవైపు.. కార్తిక మాసంలో నిర్వహించే వనభోజనాలు కాస్తా.. కుల భోజనాలకు మారాయనే విమర్శలు లేకపోలేదు.. అయితే, నేడు, రేపు రెండు రోజుల పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వనభోజనాలు నిర్వహించనున్నారు..

నేడు, రేపు అమలాపురంలో సామాజిక వర్గాల వారీగా భారీ ఎత్తున కార్తీక వన భోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. నేడు కాపుల వన భోజన కార్యక్రమం ఉండగా.. రేపు శెట్టిబలిజ సామాజిక వర్గ వన భోజనాలు ఉన్నాయి.. అయితే, జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించారు.. కోనసీమలో సెక్షన్ 30 ఈ నెల చివరి వరకు అమల్లో ఉంటుందని డీఎస్పీ అంబికా ప్రసాద్ ప్రకటించారు.. ఈ సమయంలో డీజేలతో రోడ్లపై ఊరేగింపులకు అనుమతి లేదని.. సైలెన్సర్లు తీసి తిరిగే మోటార్ సైకిళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వ్యక్తులను, వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు నిషేధం విధించినట్టు హెచ్చరించారు. వ్యక్తులను వర్గాలను కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఉంటే చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు పోలీసు అధికారులు.