Leading News Portal in Telugu

Tammineni Sitaram: ఆర్కే ఎందుకు రాజీనామా చేశారో నాకు తెలియదు..


Tammineni Sitaram: ఆర్కే ఎందుకు రాజీనామా చేశారో నాకు తెలియదు..

Tammineni Sitaram: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశారన్నా వార్త తనకు ఇప్పుడే తెలిసిందని ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వెల్లడించారు. ఓఎస్డీ ద్వారా సమాచారం అందిందన్నారు. ఆర్కే ఎందుకు రాజీనామా చేశారన్న స్పష్టత గురుంచి తనకు తెలియదన్నారు. ఆయనతో పర్సనల్‌గా మాట్లాడి తెలుసుంటామని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా ఇచ్చినంత మాత్రాన అది రాజీనామా కింద ఆమోదించలేమని, ఆ రాజీనామా రాజ్యాంగబద్ధంగా ఉందో లేదో చూసేంతవరకు దీనిపై స్పష్టత ఇవ్వలేమన్నారు. ఆర్కేకు సముచిత స్థానం ఇవ్వలేదు అందుకే రాజీనామా చేశారన్నది అవాస్తవమన్నారు. సముచిత స్థానం ఇవ్వకపోతే ఇన్నాళ్లు జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఎలా వుంటారని ఆయన ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. పార్టీతో పాటు, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. వైసీపీ సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు.. ఎమ్మెల్యే పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఆర్కే.. స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో.. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖను అందజేసినట్టు తెలిపారు.. ముఖ్యంగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ ఇంఛార్జ్‌గా గంజి చిరంజీవి బాధ్యతలు అప్పగించడమే ఈ రాజీనామాకు కారణంగా తెలుస్తుండగా.. తాను మాత్రం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్టు ఆర్కే ప్రకటించారు..

2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను గెలిపించిన మంగళగిరి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఆర్కే.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. స్పీకర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఓఎస్‌డీకి నా రాజీనామా లెటర్ అందించి రాజీనామా ఆమోదించేలా చూడాలని కోరడం జరిగిందంటూ తెలిపిన ఎమ్మెల్యే ఆర్కే.. నేను 1995 నుండి రాజకీయాల్లో ఉన్నాను.. 2004 లో సత్తెనపల్లి సీటు ఆశించా.. 2009లో పెదకూరపాడులో సీటు ఇచ్చి వెనక్కు తీసుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఇక, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత వైఎస్‌ జగన్ తోనే నేను ఉన్నానని తెలిపారు.. 2014, 2019లో ఎమ్మెల్యేగా వైఎస్‌ జగన్ నాకు అవకాశం ఇచ్చారని తెలిపారు. అయితే, నా వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.